Friday, September 29, 2017

నవరాత్రి పద్యము ౨౦౧౭

ఈ సారి నవరాత్రికి వాట్సాప్ లో,  భువనైకమాత పలురూపాలను వివరిస్తూ స్నేహితులు పంపిన సమాచారాన్ని ఆధారం చేసుకొని - రోజుకొక పాదం చొప్పున సీసపద్యము, పదవరోజైన విజయదశమినాడు ఎత్తుగీతి వ్రాసాను.

భగవదాంకితమైన ఈ పద్యములో సంస్కృతనామాలు ఉన్నవి, వాటిలో ఎవైనా వ్యాకరణబద్ధంగా లేనిపక్షాన తెలియజేయండి, సవరిస్తాను.

నమస్సులు,


నవరాత్రి ౨౦౧౭ నవపాదసీసము.
1. కఠినపర్వతరాజు కందువపట్టివి, దురు సింతలేదు మృదుత్వమేను
2. బ్రహ్మచారిణి వయ్యు బంధనవ్యామోహ గృహజీవుల యెడఁ సుదృక్కు వీవు
3. దుర్గమాన్వేషణాంతర్గతప్రశమనవీచివౌ ధర్మదిక్సూచి నీవు
4. నిఖిలజగజ్జనని యఖిలరోచిష్మతీ చరాచరధారయిత్రివమ్మ
5. నీచరాక్షసగణ నిజమూలనిర్మూలకారక గురుగుహ వీరమాత
6. తల్లివై ప్రోచు కాత్యాయనివై కాఁచు దురితము లడచఁగ దుర్గ వీవు
7. కాలభయంకర కల్మషహారిణి కలజన కిల్బిషకాలహంత్రి
8. అచలశక్తియుతేమహాదేవి వృషభాసనాఘవైరీ మౌక్తికామలతేజ
9. శితికంఠు ఘనతపస్సిద్ధికై పటుతర సిద్ధులనొసఁగిన సిద్ధిదాత్రి

తే. వివిధరూపంబులన్ జగద్విదితవిధులఁ
లోకకల్యాణంబున్ భువనైకజనని
కలుగజేసిన నీమహిమలఁ సదమల
ముద మలరుభక్తి స్తుతియించి మొ్రక్కులిడుదు

No comments:

Post a Comment