Saturday, December 7, 2013

ఆటవిడుపు

సంజయ్ దత్తుడికి కారాగృహము నుండీ మళ్లీ ఆటవిడుపు దొరికింది.

తే. చిక్కి చెరసాల గదులలో చితికిపోయి
బ్రతుకు నీడ్చుట పేదవారి తల వ్రాత
బలిసి అచ్చోట సారెకు బయట కేగి
బ్రతుక నేర్చుట పెద్దవారి తల వ్రాత

Friday, December 6, 2013

తెలుగు గాయకులు

ఇంట్లో ఈ మధ్యనే క్రోమ్కాస్టు పుణ్యమా అని యూట్యూబులోని సద్దృశ్యకాలు విస్పష్టముగా చూడగలుగుతున్నాము. ఈటీవీ వారి స్వరాభిషేకం ఆ విధంగానే పరిచయ మయ్యింది. తెలుగుతెరపై వెలసిన చక్కటిపాటలను ఏరికోరి క్రొత్తపాత గాయకులతో పాడించడం ఒక గొప్ప ఆలోచన.  బాలసుబ్రహ్మణ్యంగారు, వాణీజయరామ్ గారు మున్నగువారు సుప్రసిద్ధులే.  అసలు సిసలు సిసింద్రీలు వారికి తోడుగా నిలిచి పాటలు పాడుతున్నవారు.  మాళవిక, సాయిచరణ్, ప్రణవి, రోహిత్, గోపికాపూర్ణిమ, మల్లికార్జున్, కృష్ణచైతన్య మొదలైన క్రొత్తవారు అత్యద్భుతంగా పాడారు. ఇటువంటి కళాకారులు పాడడానికి సిద్ధముగా ఉన్నప్పుడు మన సంగీతదర్శకులు ఉత్తరభారత గాయకుల వెంట ఎందుకు పరుగులుపెడతారో నాకు బొత్తిగా అర్థము కాదు.  తెలుగు చిత్రసీమను ఏలుకోవలసిన వీళ్లు పేరుప్రఖ్యాతులు సంపాదిస్తున్నారో లేదో నాకు తెలియదు. లేదనే నా అనుమానం. నా అనుమానం తప్పని ఎవఱైనా నిరూపిస్తే నాకు ఆనందమే.


మత్తకోకిల.  గాత్ర మాధురి వాగ్విశుద్ధియుగల్గి లక్షణ గీత వై
చిత్రి నేర్పుగ చూప గల్గి విశిష్టగాయకబృంద స
న్మిత్ర భావము పొంది నేడు సునిశ్చితంబుగ వీరలే
మాత్ర మేలిరి చిత్ర సీమను? మాన్యులన్యులె చూడగా

Sunday, December 1, 2013

థార్ - ద డార్క్ వల్డ్ (Thor - the dark world)

Thorly confused

సీ.  థారను ముద్గరధారుని కథయిది
ఒంటికంటి జనకు డోడిను కథ
తనవారి కనుగప్పు తమ్ముడు గద్దెకై
ప్రాకులాడి మెలగు లోకికథ
పరలోక మేగినా వదలక స్నేహము
పాటింటి ప్రేమించు పడతి కథ
ఈప్సితార్థ మిడుచు నీథరు పడగొట్టు
చెడువారి నెట్టులో చెప్పుగాథ

తే. లోకములు తొమ్మి దొక్కట నేకమైన
పగిది కనిపించు సమయాన పలువిధములు
మాయలు జరుగునని చెప్పు మాయగాథ
తేటపఱచుట తెలియని తికమకకథ

Saturday, November 30, 2013

Facebook పద్యాలు

ముఖపుస్తకములో నేను ప్రచురించిన కొన్ని పద్యాలను ఇక్కడ సేకరించి పెడుతున్నాను.

సచిను తెందుల్కర్ క్రికెట్టాట నుండి విరమించుకొన్న సందర్భములో

చ. ఇరువది నాల్గు వత్సరములేపుగ కాసిన చెట్టువోలె నీ
పరువుల పంట పండె, యువభారతవీక్షకకోటితృప్తమై
పరగెను, క్రీడ లన్యముల పట్టము గట్టని వింతదేశపా
మరము నదృష్టమై వెలసె, మాన్యుడవైతివి దేశరత్నమా.



విజయనామ సంవత్సర కార్తికపౌర్ణమి నాడు, పెళ్లయి తొమ్మిదేళ్లు గడచిన సందర్భములో
 
ఉ. కార్తికపౌర్ణ మీ దినము, కమ్మని జ్ఞాపకముల్ జనించినే
స్ఫూర్తికి మారుపేరువయి, సుందరజీవన మార్గదర్శివై
భర్తకు తగ్గ భార్యవయి, పాయని స్నేహ సహాయమై, దయా
మూర్తివి నీవెయై నిలిచి, మోదము గూర్చితి తొమ్మి దేండ్లలో



తరుణ్ తేజపాలుడు చేసిన చెడుపనిపై

ఉ. అద్దపు మేడలోన నడయాడుచు నుండెడివాడు పోవునే
బ్రద్దలుసేయ నిండ్ల నితరత్ర, తెహల్కవిలేఖరాజు వే
సద్దులడప్పురాజు వలె, సారెకు తప్పుల త్రోవదొక్కచున్
దిద్దుటకేగె నన్యులను తేరగ, చిత్తము తత్తరించెనో



ఆమాద్మి పక్షానికి లభిస్తున్న మద్దతుచూసి కన్నుకుట్టి కొన్ని కూటములు చేస్తున్న చెడు పనులపై

ఉ. నీతిని నమ్మి కూటమిని నిల్పిన ధీరుడు కెజ్రివాలు ప్ర
ఖ్యాతి గడించె దేశమున, కల్మషపక్షము లీసడించి రా
పై తమ కారుకూతలను ప్రక్కకు త్రోయు ప్రజాళి నమ్మికన్
గోతుల త్రవ్వి మాన్పుటకు క్రొవ్విన మూఢులవోలె గూడిరే

కూటమి - party
కల్మష పక్షము - corrupt party

Toothbrush

తెలుగు పదం గుంపులో టూత్బ్రష్ పైన జరిగిన చిన్న చర్చ, అందులో రెండు కంద పద్యాలు, ఇవిగో


నేను -
క. పిలుతురు బ్రష్షని కుంచెను
సులువుగ నాంగ్లంబున, నతి సులువుగ టూతై
చెలగెను పల్లున్, వాటిని
కలగలిపి నుడివిన వచ్చు గాదా టూత్బ్రష్


Toothbrushను పల్లకుంచె లేక పంటికుంచె అని వ్యవహరించవచ్చునని నా ప్రతిపాదన.

ఏమంటారు.

నమస్సులు, గిరి


సుబ్బాచారి గారు - 
ఇదే ట్రూ ట్రాన్స్ లేషన్ అంటే. తెలుగువారికి చక్కని తెలుగు మాట ఉంది కదా అదే మొఖంపుల్ల. చక్కగా అలా పిలుద్దాం. నాలికబద్ద అనేది మరొకటి ఉందీ. అంటే టంగ్ క్లీనర్ అన్నమాట. అనువాదాలు చేసే ముందు మన తెలుగు పదాలు వెదుకుదాం. సుబ్బాచారి పులికొండ.

నేను
పద్యం హాస్యానికి :-)

క. మక్కికి మక్కీ యైనను
చక్కని యనువాదమెపుడు సరసమె చూడన్
ప్రక్కకు త్రోయన్ దగునే
చొక్కపు పదము పులికొండ సుబ్బాచారీ

కేవలం ట్రూ ట్రాన్స్లేషనని వదులుకోవద్దు, దేశ్యమైన పదము ఇప్పటికే ఉంటే అది వేఱు.

ముఖంపుల్లని నేను వినలేదు. నాలికబద్ద తెలుసు, వాడుతాను కూడా.
 
 
సుబ్బాచారి గారు - 
మా ఖమ్మంజిల్లా లో ఈ మాట చాలా విస్తృతంగా వాడుకలో ఉంది. మీ పద్య కళ కూడా బాగుంది.   సుబ్బాచారి