Sunday, June 27, 2010

హనుమంతుని సౌశీల్యము

ఈ కాలపు మనుష్యులకి (ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలలో పని వెలగబెట్టే రకాలకి) లోకపు భారమంతా తామే మోస్తున్నామన్న భ్రమ అధికమవుతోంది. ప్రతి ఒక్కడూ ఒక చిన్న ఢంకాయే.

‘ఆఫీసులో నేను లేకపోతే క్షణం సాగదు’
‘మా బాసు నేను లేందే అడుగు తీసి అడుగు వేయలేడు’
‘ముప్పై మిలియన్ డాలర్ల్ ప్రాజెక్టుని ఒక్క చేత్తో నడుపుతున్నాను. ఇంతకు ముందిలాంటివి ఎన్నో చేసాలే, అందుకే పెద్ద విషయం కాదు’
‘కంపెనీ వారు నా పనికి మెచ్చుకొని కాన్ఫరెన్సుకి హవాయి పంపుతున్నారు. సంస్థ మొత్తంలో ఇద్దరినే ఎన్నుకున్నారు - మనకి ఇలాంటివి అలావాటేలే’

ఏ తుట్టని కదిపినా ఇదే రొద.

ఈ సోదిపెట్టే మొహాలమీద చెంప పెట్టులా రామాయణంలో హనుమంతుని సౌశీల్యము గరించి చెప్పాలి. హనుమంతుని బలాబలాల గురించి వేఱుగా చెప్ప నవసరం లేదు కానీ, ఆ మహనీయుని వినమ్రత, సౌశీల్యము చూసి నేర్చుకోవలసినది మాత్రం చాల ఉంది. హనుమ గొప్పతనానికి మచ్చుక నాలుగు ఉదాహరణలు క్రింద ఉన్నాయి. అలాంటి గొప్పవాడు, లంకకు వెళ్ళి సీతను చూచి, తిరిగి వెళుతున్నప్పుడు, ‘సీతమ్మ తల్లి పాతివ్రత్యం వల్ల నేను ఇంతటి ఘనకార్యాన్ని నెరవేర్చగలిగాను కానీ, నాదేముంది ఇందులో’ అనుకుంటాడు, ఎవరికి సాధ్య మది?

===


1) శ్రీరాముడు ఋష్యమూక పర్వతం వద్ద హనుమంతుణ్ణి కలిసిన కొద్ది సేపటికి నుడివిన పలుకులవి.

సౌమిత్రీ, కనుమయ్య వానరుని వాక్చాతుర్యమున్, సాధ్యమే
సామాన్యుల్ వచియించ నేర్వగలరే శ్రావ్యంబుగా నివ్విధిన్,
ధీమంతుండగు నిట్టి దూత యొకడే తేఁజాలుఁ శ్రీమజ్జయం
బామోదంబుగ, వీని స్నేహము నెడం బాటింప కేనాటికిన్

(తాత్పర్యము: లక్ష్మణా, చూసావా ఇతని వాక్చతురత, సామాన్యులు ఇంత చక్కగా మాట్లాడగల రంటావా? ధైర్యవంతుడైన ఇలాంటి దూత ఒక్కడుంటే చాలుఁగా విజయలక్ష్మిని తీసుకురాను. ఇతడి స్నేహాన్ని ఎన్నడూ విడువబోకు)

2) సముద్రమెటుల లంఘించుటాయని వానరవీరులు తర్జనభర్జనలు చేయు సమయమున జాంబవంతుని పల్కులివి

అరయన్ వానర వీరయోధులకు నీ ఔన్నత్యమెట్లబ్బు, వా
నర శ్రేష్ఠా, అనిలాత్మజా, ధనదుడున్ నాకేశు బ్రహ్మాదులున్
వరముల్ పెక్కులు ధారపోయగ మితాభ్యాసంబునే వేత్తవై
గరిమన్ పొందిన వాడవీవు గద, పింగాక్షా వెతన్ తీర్పుమా

(తాత్పర్యము: తఱచి చూడగా ఈ వీరయోధులలో ఎవరికీ నీకున్న ఔన్నత్యము లేదని తెలుస్తుంది, వానరులలో ఉత్తముడా, వాయుపుత్త్రుడా, కుబేరుడు, ఇంద్రుడు, బ్రహ్మ మొదలుగు వారు ఎన్నో వరములు నీకు ఇచ్చిన కతన నీవు ఎక్కవ శ్రమలేకుండానే గొప్పవాడవయ్యావు కదటయ్యా, పింగాక్షా -సీతమ్మను ఎలా చేరాలో తలియక మేము పడుతున్న - కష్టాన్ని తీర్చవయ్యా)

3) యుధ్ధంలో ఇంద్రజిత్తు బాణాల ధాటికి శ్రీరామ లక్ష్మణులతో పాటు వానరసేన మొత్తము మూర్ఛిల్లినది. హనుమంతుని తోడుగా విభీషణుడు జాంబవంతుణ్ణి వెతికి చేరి సేదతీర్చాడు. రామలక్ష్మణుల సుగ్రీవాంగదుల యోగక్షేమాలు అడుగక, ముందు ఆంజనేయుని క్షేమసమాచారము లడిగాడు జాంబవంతుడు. అలా అడగడానికి కారాణ మడిగిన విభీషణునికి ఆ వృధ్ధయోధుని జవాబిది.

విను, ధీయుక్త విభీషణా, నిహతులౌ వీరాళికిన్ ధాతయై
క్షణకాలంబున చేతనత్వము నిడన్ కార్యోన్ముఖుండైన మా
హనుమంతుండొకడున్న చాలు నతడే ఆజిన్ హతుండైన వీ
ర నియోధ్ధుల్ శతవేవురైన మృతతుల్యానీకముల్ చూడగన్?

(తాత్పర్యము: ధీరుడా విభీషణా విను, ప్రాణాలు పోయి పంక్తులుగా పడి యున్న వీరుల పాలిటి బ్రహ్మదేవుని వలె వచ్చి క్షణంలో చైతన్యము కలిగించడానికి, ఆ పని చేయబూనిన హనుమ ఒక్కడు చాలు. అతడే యుధ్ధంలో మరణిస్తే, వందలు వేలూ బ్రతికియున్నా ఈ యోధ్ధులందరూ మృత సేనలతోనే సమానము )

4) ఇక హనుమ దెబ్బ తిన్న లంకిణి మాట వేఱుగా చెప్పాలా?

చచ్చితిరయ్యొఁ దింటి మఱుజన్మకు జ్ఞాపకముండు దెబ్బ, నిన్
పుచ్చెద లంకలోపలకు పోరుకు సత్తువఁ జచ్చి పోయెరా,
వచ్చెడి వాడు రౌద్రుడని బ్రమ్మయ తొల్లిటఁ జెప్పె వానరా,
వచ్చితివే వినాశనము వచ్చెను తోడుగ లంకకున్, హరా!